ABOUT US


మా గురించి..

"పల్లెప్రపంచం సర్వీసెస్" అనేది ఇండియన్ పార్టనర్ షిప్ ఏక్టు 1932, సెక్షను 58(1) ప్రకారం రిజిష్టరు చేయబడిన సంస్థ.
రిజిస్ట్రేషను నెంబరు : 123/2018(ఖమ్మం)
Head Office : 2-22/2, రైస్ మిల్ వీధి, చొప్పకట్లపాలెం-507204, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ.


  • నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తయారుచేయడం మరియు వివిధ కంపెనీలకు చెందిన అన్ని రకాల ప్రొడక్టులను మార్కెటింగ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించాలనేది సంస్థ మొదటి లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా సహజ పంట ఉత్పత్తులను పండించడం, వాటితో కొన్ని నిత్యావసర వస్తువులను తయారు చేయడం ద్వారా ప్రజారోగ్యానికి తోడ్పాటునందిచవచ్చు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. చేనేత మరియు ఇతర చేతివృత్తుల ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం ద్వారా స్వతంత్ర ఉత్పత్తిదారులకు ఉపాధిని కల్పించడంతోపాటు అటువంటి సహజ ఉత్పత్తులను వాడడం ద్వారా పర్యావరణానికి మేలు కలిగించవచ్చు.

  • సంస్థ తరపున పత్రికల, పుస్తకాల ప్రచురణ, మార్కెటింగ్ జరుగుతుంది. ఆన్లైన్లోనూ డిజిటల్ ఎడిషన్ నడిపేందుకు కృషి చేయడం జరుగుతుంది. మంచి భావాలను పెంపొందించడం ద్వారా ప్రజాచైతన్యం తీసుకురావడం దీని లక్ష్యం. రేటింగులకోసం కాకుండా మంచి అంశాలను వ్యూస్ గానూ, వివిధ శీర్షికల రూపంలోనూ అందించడం ద్వారా సామాజిక చైతన్యం కల్పించేందుకు, సమాజ అభివృద్ధికి మావంతు కృషి చేస్తాము. పత్రికల నిర్వహణలను ప్రజాపక్షం వహిస్తూ జనవిజయం సాధించేందుకు కృషి చేస్తాము. ఈమేరకు జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహిస్తాము. పత్రికా రంగంలో సర్క్యులేషన్,ప్రకటనల సేకరణల ద్వారా కూడా నిరుద్యోగులకు ఉపాధిని అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. ఇతర పత్రికల సర్క్యులేషన్,ప్రకటనల సేకరణల ద్వారా కూడా మార్కెటింగ్ అవకాశాలను పెంపొందించే ప్రయత్నం చేస్తాము.

  • ప్రతి మనిషిలో అంతర్గతంగా దాగివున్న శక్తులను వెలికితీసేందుకుగాను వివిధ అంశాలలో అనుభవాజ్ఞులచే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మనోవిజ్ఞానం, విద్య, వైద్యం, తత్వశాస్త్రం, పరిపాలన, రాజకీయం, విజ్ఞానశాస్త్రాభివృద్ధి, పరిశోధనలు, మొదలగు అంశాలలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తిచైతన్యం పెంచేందుకు కృషి చేస్తాము. జర్నలిజం, సేంద్రీయ వ్యవసాయం, యోగాసనములు, ప్రకృతి జీవన విధానం, ఆల్టర్నేటివ్ మెడిసిన్, టైలరింగ్, చేతివృత్తుల తయారీలు, మొదలగు రంగాలలో నిపుణులతో ట్రైనింగ్ ప్రోగ్రాములను నిర్వహించడం జరుగుతుంది.

  • టీవీ, మొబైల్, సోషల్ మీడియా వంటివి పెరిగి అంతా డిజిటల్ మయంగా మారడంతో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతోంది. పుస్తకాలు కూడా ఈ-బుక్స్ గా వస్తున్నాయి. అయినా పుస్తకానికున్న ప్రత్యేకత తరగనిదనే మేము భావిస్తున్నాము. మంచి పుస్తకాలు చదవడం, ముఖ్యంగా నీతికథలు వంటివి చదవడం అలవాటు కోల్పోవడంతో మానవ సంబంధాలపైనా, సమాజంలో నీతినియమాలపైనా దుష్ప్రభావం చూపుతుంది. ఈ లోపాన్ని కొంతైనా సవరించేందుకు ఇంటింటా గ్రంథాలయాలు కాన్సెప్ట్ ద్వారా మంచి పుస్తకాలను ప్యాకేజిలుగా అమ్మడం ద్వారా బిజినెస్ ప్లాన్ నిబంధనల మేరకు తిరిగి వారు డబ్బు పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనితో పుస్తకాల కొనుగోలుపై ఆసక్తి పెంపొందించాలని భావిస్తున్నాము. ప్రతిదీ ఆర్థిక భారంతో కూడుకుని ఉంటుంది కనుక, ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రతి ఇంటిలో ముఖ్యమైన గ్రంథాలను, పుస్తకాలను వుండేలా చేయవచ్చన్నది మా ఆకాంక్ష. దీనిని విజయవంతం చేసుకోగలిగితే చిన్నతనం నుండే పిల్లలలో పుస్తక పఠనాన్ని పెంపొందించవచ్చు. కొన్ని టీవీ సీరియల్స్, భయంకరమైన వీడియో గేమ్స్ చూడడం ద్వారా పసి మనసులలో ప్రతికూల భావాలు పెరగడమే గాక సామాజిక ఆరోగ్యంపైకూడా పెనుప్రభావం చూపుతుందని కొన్ని సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. వీటికి విరుగుడుగా చదవడం` అనే మంచి అలవాటును పెంచితే చాలా రకాలుగా వ్యక్తులకు, సమాజానికి మేలు జరుగుతుంది. ‘పుస్తకం హస్తభూషణం` అన్నారు పెద్దలు. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కోకానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో` అన్నారు మహనీయులు.అంతటి ప్రాధాన్యం వున్నా పుస్తక పఠనం నేడు తగ్గుతుండడం, ఆ స్థానంలో అనవసర వ్యాపకాలు చేరడం మంచి పరిణామం కాదు. ఇంట్లో పుస్తకాలు వుంటే ఖచ్ఛితంగా పిల్లలకు అధ్యయనం` అనేది ఒక మంచి అలవాటుగా కూడా మారే అవకాశం వుంది. పిల్లలకోసమైనా సదుద్ధేశంతో మేము చేస్తున్న ఈ పనికి మద్దతు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. పిల్లల చేతిలో మొబైల్ వుండే బదులు పుస్తకం వుంచడం నేర్పండి. శుభకార్యాలలో బహుమతులుగా పుస్తకాలను ఇవ్వడం అలవాటుగా మార్చుదాం. ఇలా వీలైనంతగా పుస్తక పఠనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిద్దాం.

  • భారతీయ సంస్కృతిలో మొక్కల పెంపకానికి తగు ప్రాధాన్యతనిచ్చారు. ‘వృక్షో రక్షతి రక్షిత:` అన్నారు పెద్దలు. కానీ నేడు ఆ సంస్కృతి కనబడటం లేదు.పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో భారతీయత అనేక విషయాలలో తడబడుతున్నది. ఎన్నో విషయాలలో మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను విపత్తు పర్యావరణ సమస్య. మొక్కలు పెంచకపోగా అటవీసంపదను కొల్లగొడుతున్నారు. మరోవైపు విపరీతమైన పారిశ్రామికీకరణ వలన కాలుష్యం పెరిగిపోతున్నది. దీనివల్ల అనేక పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రకృతి నాశనమవుతుంది. ఫలితంగా మానవాళి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నది. దీనికి కొంత పరిష్కారం చెట్లను కాపాడటం, కొత్తగా మొక్కలను పెంచడంద్వారా సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నా, ప్రజలలో చైతన్యం లేనందున ఈ విషయంలో తగినంత పురోగమనం వుండడం లేదు. ‘పల్లెప్రపంచం సర్వీసెస్` తరపున ప్రతి ఇంటిలో మొక్కలు పెంచేలా కృషి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాము. పర్యావరణంపై అవగాహన కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరి చేతా మొక్కలు నాటించే కార్యక్రమం చేపడతాము. వీటిని పత్రికలలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. గ్రామాలలో నర్సరీలను, పండ్లతోటలను, ఇతర గార్డెన్స్ ను పెంచడంలో సభ్యుల భాగస్వామ్యంతో పురోగతిని సాధిస్తాము. ఇందుకుగాను,సభ్యులకు బిజినెస్ ప్లాన్ ద్వారా ఇన్సెంటివ్ లను అందించడం జరుగుతుంది. ఇలా పల్లెప్రపంచం గార్డెన్స్` ఏర్పాటు ద్వారా ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు సభ్యులకు ఆర్థికంగా ఆలంబనగా నిలవడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయడం జరుగుతుంది.

  • మన గ్రామీణ ప్రాంతాలు ప్రకృతి జీవన విధానానికి దగ్గరగా వుండేవి. అన్నింటా నేడా పరిస్థితికి దూరం అవుతున్నారు. దీనివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వ్యవసాయం, ఆహారం, మానవ సంబంధాలు, పండుగలు...ఇలా అన్నింటా సహజ సిద్ధమైన వాతావరణం వుండేది. మనుషుల మధ్య ఆప్యాయతానురాగాలుండేవి. గ్రామాలలో ఒకరికొకరు సహకరించుకునేవారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండేవారు. ఆటపాటలతో, పచ్చని పంటపొలాలతో, పక్షుల కిలకిలారావాలతో పల్లెలు కళకళలాడుతుండేవి. నేడు వ్యవసాయం దండుగమారి పనిగా మారింది. సహజ సిద్ధమైన సాగు విధానం గాక పురుగుమందులు, రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడంతో పంట ఉత్పత్తులు కలుషితం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం పాలిట, జీవరాసుల పట్ల ఇది పెనుశాపంగా మారింది. కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వైద్యుల సంఖ్య, స్పెషలిస్టుల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్నా రోగాలు, రోగుల సంఖ్య తగ్గడం లేదు. చిన్నవయసులోనే రోగాలబారిన పడడం, శక్తిహీనంగా తయారుకావడం, ప్రతి చిన్న పనికీ యంత్రాలపైనే ఆధారపడడంతో శారీరక శ్రమ తగ్గడం, కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజారోగ్యం విపరీత పోకడలకు గురవుతున్నది.నగరీకరణపై, సులువు సంపాదనపై మోజు పెరిగి పల్లెలనుండి ప్రజలు వలసబాట పడుతున్నారు. పిల్లల చదువుల పేరుతో కొందరు తల్లిదండ్రులను, మరికొందరు పిల్లలను దూరంగా వుంచుతున్నారు. బాల్యం, వృద్ధాప్యం రెండూ శాపంగా మారాయి. గతంలో దేవాలయాల ద్వారా అనేక మంచి విషయాలను చెప్పేవారు. నాటి దేవాలయాలు విజ్ఞానం, మంచి జీవన విధానం నేర్పే కేంద్రాలుగా వుండేవి. నేడు భక్తి అయినా, దేవాలయాల పరిస్థితులలోనూ వ్యాపార, ఆధిపత్య ధోరణులు పెరిగాయడంలో అతిశయోక్తి లేదు. యోగా, బుర్రకథలు, నీతికథలు, పండుగలు, గౌరవభావాలు...ఇలా అన్నీ విలువలతో కూడుకుని వుండేవి. కొన్ని మూఢనమ్మకాలు, భావాలు మినహా అన్నింటా నాటి పల్లె జీవనమే బాగుంది. తిరిగి ఆ పల్లె జీవనాన్ని ముఖ్యంగా ప్రకృతి జీవన విధానాన్ని శాస్త్రీయంగా ఆ విధానంలో వుండే శక్తిని అందరికీ శిక్షణా తరగతుల ద్వారా తెలియజేస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని,గార్డెన్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా పల్లె ప్రపంచం`ను ప్రగతి పథాన నడిపిద్దాం.

మేము చేస్తున్న ఈ మంచి పనికి మీరందరూ చేయూతనిచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

- పల్లా కొండలరావు (మేనేజింగ్ పార్టనర్)
కలసి శ్రమిద్దాం! ప్రగతి సాధిద్దాం!!

విజయం అనేది గమ్యం కాదు. నిరంతర ప్రయాణం.


Copyright © 2018. All Rights Reserved.